ఫాక్స్ సాగర్ FTL పరిధిలో హైడ్రా కూల్చివేతలు..మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు

ఫాక్స్ సాగర్ FTL పరిధిలో హైడ్రా కూల్చివేతలు..మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు

హైదరాబాద్: నగరంలోని ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలు, గేట్లను తొలగించింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడతో పాటు గేటును కూడా హైడ్రా అధికారులు తొలగించారు.

దూలపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 124లో దాదాపు 15 ఎకరాల ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి నింపి ప్రహరీ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించే చర్యల్లో భాగంగా ఫామ్‌హౌస్‌కు సంబంధించిన ప్రహరీ గోడ, గేటును తొలగించారు.

అలాగే చెరువులో అర కిలోమీటర్ మేర నిర్మించిన బండ్‌పై కూడా హైడ్రా చర్యలు చేపట్టింది. బండ్‌ను ఆనుకుని ఫామ్‌హౌస్ కోసం నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేసింది. మరోవైపు జీడిమెట్ల పరిధిలోని సర్వే నంబర్లు 41, 42లోనూ ఆక్రమణలను తొలగించింది. దాదాపు 20 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేసింది.

►ALSO READ | తెలంగాణ జైళ్ల శాఖ విన్నూత కార్యక్రమం. ఖైదీల కోసం ఆటలు, వినోదం..చర్లపల్లి సహా అన్ని జైళ్లకు ULLASAM 

ఈ కూల్చివేతలను సుప్రీంకోర్టు న్యాయవాది సౌరబ్‌రాజ్ వర్మ అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అధికారులు ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ హద్దులను చూపిస్తూ ఆక్రమణల తొలగింపు చర్యలను కొనసాగించారు. ఫాక్స్ సాగర్ చెరువు పరిరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఆక్రమణలను గుర్తించి హైడ్రా ఈ చర్యలు చేపట్టింది.